అల్లు అర్జున్ తన ఆవేదన వెల్లడించుకునేందుకు శనివారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టడంతో ఈ సమస్యని ఇంకా పెద్దది చేసుకున్నట్లయింది. అల్లు అర్జున్‌పై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్ పెట్టి అల్లు అర్జున్ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా ఆయనకు థియేటర్ బయట జరిగిన ఘటన పోలీస్ అధికారులే తెలిపారని, అయినా అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యేవరకు బయటకు రానని మొండికేశారని ఆరోపించారు. థియేటర్‌లో నుంచి అల్లు అర్జున్‌ని బయటకు తీసుకువెళుతున్న వీడియో ఫుటేజ్ కూడా మీడియాకు విడుదల చేశారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. “అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానపరిచిన్నట్లు మాట్లాడారు. ఇందుకు ఆయన బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రతీ దానికి పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి. కనుక ఈ ఘటనపై రాజకీయాలు చేయవద్దని అల్లు అర్జున్‌కి సూచిస్తున్నాను.
సినీ పరిశ్రమ పట్ల మా ప్రభుత్వానికి ఎటువంటి కక్షలేదు. మాకూ, సినీ పరిశ్రమకు మద్య ఎటువంటి విభేధాలు, దూరం లేవు. కానీ కొందరు మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు, “ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు, అల్లు అర్జున్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.