కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. కానీ ఇంకా పలువురు ఉన్నతాధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టవలసి ఉన్నందున కమీషన్ గడువు మరోసారి పొడిగించక తప్పదు. త్వరలోనే గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
ఈ ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఈ పని మొదలుపెట్టింది. అప్పుడు మూడు నెలలు గడువు పెట్టింది. కానీ విచారణ పూర్తికాకపోవడంతో రెండేసి నెలలు చొప్పున రెండుసార్లు గడువు పొడిగించింది. ఇప్పుడు మరోసారి గడువు పొడిగించబోతోంది.
ఈ ప్రాజెక్టు పనులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందని భావించిన ప్రతీ ఉన్నతాధికారిని జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ పిలిపించి ప్రశ్నించి వివరాలు రాబడుతోంది. ఎస్కే జోషీ, రజత్ కుమార్, స్మితా సభర్వాల్ తదితర ఐఏఎస్ అధికారులను, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ఇంజనీర్లు, ఇంకా పలువురిని కమీషన్ విచారించింది.
ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సహా ఆశాఖలో పలువురిని త్వరలో విచారించనుంది. చివరిగా మాజీ సిఎం కేసీఆర్, మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ పార్టీలో ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిసి నివేదిక తయారు చేసేందుకు మరో 2-3 నెలల సమయం పట్టవచ్చు.