ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కి హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ నెల 30వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
ఈ కేసుని కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసుకి సంబందించి కొన్ని ప్రాధమిక అంశాలు పరిశీలించాల్సి ఉంది కనుక ఆ వివరాలను సమర్పించాలని ఏసీబీని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌కు నోటీసులు పంపింది.
కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదిస్తూ, “ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందిన్నట్లు కానీ అవినీతి జరిగిన్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఈ రేసింగ్ నిర్వహణలో స్పాన్సర్ మద్యలో తప్పుకోవడంతో, ప్రభుత్వమె జోక్యం చేసుకొని 2023 బకాయిలు చెల్లించింది.
గత ప్రభుత్వం విదేశాలకు చెందిన రేసింగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడం వలన ఆర్బిట్రేషన్ (అంతర్జాతీయ న్యాయ వివాదం) ఎదుర్కోవలసి వస్తోంది. ఈ రేసింగ్ వలన ప్రభుత్వానికి రూ.110 కోట్లు ఆదాయం కూడా వచ్చింది. కానీ వ్యక్తిగత, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేయబడింది కనుక ఈ కేసుని కొట్టి వేయవలసిందిగా కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం కోరారు.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, “ఈ వ్యవహారంపై ఏసీబీ చాలా లోతుగా విచారణ జరిపిన తర్వాత అవినీతి జరిగిందని నిర్ధారించుకున్నాకనే ప్రభుత్వం, తెలంగాణ అనుమతితో కేసు నమోదు చేసింది.
రూ.10 కోట్లకు మించి నగదు విదేశాలకు బదిలీ చేయాలంటే ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తప్పనిసరి. కానీ మాజీ మంత్రి కేటీఆర్ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అక్టోబర్ 27న ఒప్పందం రద్దు అయితే అక్టోబర్ 30న హెచ్ఎండీఏ ద్వారా 54.88 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లింపజేశారు.
ఇది ఆర్ధిక నేరం కనుకనే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో కేసుకి సంబందించి ప్రతీ విషయాన్ని పేర్కొనలేము. నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపిన తర్వాత ఈ కేసుకి సంబందించి మరిన్ని విషయాలు తెలుస్తాయి.
కనుక పూర్తిగా పరిశీలించకుండా ఎఫ్ఐఆర్ దశలోనే కేసుని కొట్టివేయాలని కోరడం సరికాదు. ఒకవేళ నిందితుడికి ఏవైనా అనుమానాలుంటే మద్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది కదా?” అని వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 30వరకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయవద్దని, ఆలోగా ఈ కేసుకి సంబందించి పూర్తి వివరాలు సంపారించాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.