ఫార్ములా1: శాసనసభలో చర్చకు భయమేల?

ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో నేడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతూ శాసనసభకు వచ్చారు. శాసనసభలో దీనిపై చర్చ జరపాలని హరీష్ రావు పట్టుబడుతున్నారు. 

ఈ వ్యవహారంలో కేటీఆర్‌ నేరం చేశారని ఆరోపిస్తూ మీ ప్రభుత్వం మా నాయకుడిపై కేసు నమోదు చేసినప్పుడు, దానిపై శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?అని హరీష్ రావు నిలదీశారు. 

శాసనసభ్యుడైన కేటీఆర్‌పై ఈ నేరారోపణ చేస్తున్నప్పుడు, నేరం చేయలేదని చెప్పుకునేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా?అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంపై శాసనసభలో చర్చించడానికి అనుమతిస్తేనే తాము సభకు సహకరిస్తామని లేకుంటే లేదని హరీష్ రావు తెగేసి చెప్పారు. 

ఇటువంటి అంశం సభ ముందుకు వచ్చినప్పుడు సంబందిత మంత్రులు సభలో లేకపోవడం పిరికితనంతో తప్పించుకుపోవడంగానే భావిస్తున్నామని హరీష్ రావు ఆక్షేపించారు. తాము ఎన్నికల హామీలు అమలుచేయాలని ప్రభుత్వం వెంటపడుతున్నందుకే ఇటువంటి అక్రమకేసులు బనాయించి భయపెట్టాలని చూస్తోందని, కానీ ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదని, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేవరకు రేవంత్ రెడ్డి వెంటపడుతూనే ఉంటామని  హరీష్ రావు అన్నారు.