అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు కేసు విచారణ చేపట్టడం సాయంత్రానికల్లా మద్యంతర బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పేట విచారణ మాత్రం వాయిదాలు పడుతూనే ఉంది. ఈరోజు హైకోర్టులో దానిపై విచారణ జరిపిన తర్వాత తీర్పుని ఈ నెల 23ని ప్రకటిస్తామని చెపుతూ కేసుని ఆరోజుకి వాయిదా వేశారు న్యాయమూర్తి.
జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ అనూచరులు చొచ్చుకువచ్చి గొడవ చేయడంతో ఆయన తీవ్ర ఆందోళన, ఆవేశానికి గురయ్యారు. అదే సమయంలో లోనికి చొచ్చుకువచ్చిన మీడియా ప్రతినిధులు మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి ప్రశ్నించబోతే, మోహన్ బాబు ఆవేశం టీవీ9కి చెందిన రంజిత్ అనే వీడియో జర్నలిస్ట్ చేసతిలో మైకు లాక్కొని అతనిపై దాడి చేశారు.
ఆ దాడిలో గాయపడిన అతను మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై హత్యయత్నం కింద కేసు నమోదు చేసి నోటీస్ పంపారు. ఆ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయిస్తే ఆ కేసులో తీర్పు 23న వెలువడనుంది.
మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కూడా రంజిత్‌కి, టీవీ9 యాజమాన్యానికి, యావత్ మీడియాకు కూడా క్షమాపణలు చెప్పారు. మోహన్ బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ని కలిసి క్షమాపణలు చెప్పారు.
కానీ అతను కేసు ఉపసంహరించుకున్నట్లు లేదు. ఉపసంహరించుకొని ఉంటే మోహన్ బాబు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఉపసంహరించుకొని ఉండేవారు కదా?