లగచర్ల కేసులో అందరికీ బెయిల్‌ మంజూరు

లగచర్ల దాడి కేసులో అరెస్ట్‌ అయిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 24 మంది రైతులకు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఈ దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ కి మాత్రం బెయిల్‌ మంజూరు చేయలేదు. 

పట్నం నరేందర్ రెడ్డికి రూ.50,000 పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు కాగా మిగిలినవారు ఒక్కొక్కరూ రూ.20,000 చొప్పున పూచీకత్తు చెల్లించారు. పట్నం నరేందర్ రెడ్డితో సహా బెయిల్‌పై విడుదలైన వారందరూ మూడు నెలల పాటు ప్రతీ బుధవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని, విచారణలో పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం షరతు విధించింది. 

నవంబర్‌ 11న లగచర్ల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులపై దాడి చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి 25 మందిని అరెస్ట్‌ చేశారు. ఆ దాడితో సంబందం ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేశారు. 

ఈ కేసులో అందరికీ బెయిల్‌ లభించడంపై బిఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ, “న్యాయం గెలిచింది! బీఆర్ఎస్ పోరాటానికి దక్కిన మరో విజయం. సొంత నియోజకవర్గం కొడంగల్ గిరిజన రైతులపై, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, వారికి సంకెళ్లు వేసి నెలరోజులుగా జైలులో నిర్బంధించిన నియంత రేవంత్. ఈరోజు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా గిరిజన రైతులందరికీ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం,” అని ట్వీట్ చేసింది.