సంధ్య థియేటర్‌కి నోటీస్

అల్లు అర్జున్‌ అరెస్టుతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, ముఖ్యంగా సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. కానీ అల్లు అర్జున్‌కి, సంధ్య థియేటర్‌ నిర్వాహకులకు హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసి, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోమని సూచించడంతో ఇక్కడితో ఈ సమస్య ముగిసిందని అందరూ భావించారు. 

కానీ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మంగళవారం సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు నేటికీ కిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. 

కనుక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ విషాద ఘటనకు బాధ్యులుని చేస్తూ సంధ్య థియేటర్‌ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. 

సంధ్య 35 ఎంఎం, 75 ఎంఎం థియేటర్లు పక్క పక్కనే ఉన్నాయి. వాటిలోకి ప్రవేశించేందుకు, బయటకు వెళ్ళేందుకు ఒకటే మార్గం ఉంది. అది కూడా చాలా ఇరుకుగా ఉంది. కానీ థియేటర్‌ యాజమాన్యం ప్రేక్షకుల భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, దీనిని నిర్లక్ష్యంగానే పరిగణించి నోటీస్ జారీ చేస్తున్నామని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

ఇక అల్లు అర్జున్‌ మద్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీస్ శాఖ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసేది కాదని స్పష్టమవుతోంది.