కేటీఆర్‌ అరెస్టుకి రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారా?

చట్టం ముందు అందరూ సమానమే అని, తప్పు చేసినవారు ఎంత పెద్దవారైనా విడిచిపెట్టవద్దని పోలీసులకు తాను సూచించాని, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తన అనుమతితోనే జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు.

గవర్నర్‌ అనుమతి లభించగానే కేటీఆర్‌ని లోపల వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పగా, అందుకు తాను కూడా సిద్దంగానే ఉన్నానని కేటీఆర్‌ జవాబిచ్చారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయించడం ద్వారా కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసేందుకు వెనకాడబోమని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి బలమైన సందేశమే పంపారనుకోవచ్చు.

 కేటీఆర్‌ని విచారించేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన్నట్లు తెలుస్తోంది. కనుక రేపు (సోమవారం) లేదా వచ్చే వారంలో ఎప్పుడైనా ఏసీబీ అధికారులు ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో కేసు నమోదు చేసి కేటీఆర్‌కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో కేటీఆర్‌ పేరు కూడా జోడించే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండింటి విచారణ సాగుతున్న తీరుని పరిశీలించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్‌ పేరు చేర్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కనుక వచ్చే వారం నుంచి బిఆర్ఎస్ పార్టీకి దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.