నిర్మాత దిల్ రాజుకి ప్రమోషన్

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకి ప్రమోషన్ లభించింది. ఇంతవరకు సినీ నిర్మాతల మండలి, ఫిలిమ్ ఛాంబర్ కీలక పాత్ర పోషిస్తుండేవారు. ఇప్పుడు ఆయనని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఫిలిమ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ళు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.       

ఓ ప్రవాహంలా సాగిపోతున్న తెలుగు సినిమాలలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, భాష,యాస, నేటివిటీలకు ప్రాధాన్యత ఇచ్చే చిన్న సినిమాలను దిల్ రాజు చాలా ప్రోత్సాహిస్తుంటారు. కనుక దిల్ రాజు తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామితులవడం చాలా శుభ సూచకం.

ఇకపై ఆయన తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తెలంగాణకు చెందిన సినీ నటీనటులను, సాంకేతిక నిపుణులకు మరింత మేలు, గుర్తింపు కలిగించే నిర్ణయాలు తీసుకుంటారని  ఆశించవచ్చు.