ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకొని విజయోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సమయంలో శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించబోతోంది.
కనుక తమ ఏడాది పాలన ఎంత గొప్పగా సాగిందో చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకి లభిస్తుంది.
ఈ సమావేశాలలో కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడంతో పాటు, గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు, ప్రభుత్వానికి భారంగా మారిన పాత టెక్నాలజీతో నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వంటి అంశాలను మళ్ళీ చర్చకు పెట్టి బిఆర్ఎస్ పార్టీని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయవచ్చు.
శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ అవుతారని కేటీఆర్ ముందే చెప్పారు కనుక ఆయన ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవచ్చు.