పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తనకు లగచర్ల దాడితో ఎటువంటి సంబందం లేదని, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై ఈ అక్రమకేసు బనాయించిందని కనుక తనపై నమోదు చేసిన ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన పిటిషన్ కొట్టివేసింది. అంటే లగచర్ల దాడి కేసు యధాతధంగా కొనసాగుతుందని స్పష్టం చేసిననట్లే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ కోసం వికారాబాద్ జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని, మెరిట్ ఆధారంగా జిల్లా కోర్టు తగు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తీర్పులో పేర్కొంది. కనుక పట్నం నరేందర్ రెడ్డి ఈ కేసులో నుంచి ఇప్పటికిప్పుడు బయటపడలేకపోయినా, బెయిల్ పొందేందుకు అవకాశం ఉంది.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకి ప్రభుత్వం భూసేకరణకు సిద్దమై, నిబందనల ప్రకారం ముందుగా గ్రామసభ నిర్వహించాలనుకుంది. దీని కోసం జిల్లా కలెక్టర్ తదితరులు అక్కడకు వెళ్ళినప్పుడు లగచర్ల గ్రామస్తులు కర్రలు, రాళ్ళతో వారిపై దాడి చేశారు.
ఆ దాడిలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సురేష్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు పేర్కొన్నారు. అతనితో దాడికి ముందు తర్వాత పట్నం నరేందర్ రెడ్డి చాలాసార్లు ఫోన్లో మాట్లాడారని, కనుక ఈ కుట్రకు ఆయన కూడా సూత్రధారి అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.