గత రెండు మూడు నెలలుగా హైదరాబాద్ నగరవాసులను గజగజా వణికిపోయేలా చేసిన హైడ్రా, కొన్ని వారాలుగా ఎటువంటి హడావుడి చేయకపోవడంతో రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా హైడ్రాని ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఊహాగానాలు వినిపించాయి. కానీ హైడ్రా కాస్త విరామం తీసుకుందే తప్ప నిలిచిపోలేదని నిరూపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ సంస్థకు రూ.50 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు పురాపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. అ సొమ్ముతో హైడ్రాకు అవసరమైన వాహనాలు కొనగోలు చేసేందుకు, హైడ్రా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. హైడ్రా కూల్చివేతలకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సమకూర్చిన సంస్థలకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటిని కూడా ఈ సొమ్ము నుంచే చెల్లించాలని జీవోలో సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించింది. దానిలో తొలివిడతగా రూ. 50 కోట్లు నేడు విడుదల చేసింది. హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ కూల్చివేతల ప్రభావం తప్పక ఉంటుందని తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా హైడ్రాకు రూ.50 కోట్లు నిధులు విడుదల చేయడం విశేషమే. ప్రభుత్వం నిధులు సమకూర్చి సహకరిస్తోంది. కనుక త్వరలో మళ్ళీ హైదరాబాద్లో హైడ్రా హడావుడి మొదలయ్యే అవకాశం ఉంది.