ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ ఏమన్నారంటే..

మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషనలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ చక్రధర్ అనే వ్యక్తి పిర్యాదు చేయడం వెంటనే పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ, ఎన్నికల హామీలు అమలుచేయమని అడుగుతున్నందుకే నాపై ఈ తప్పుడు కేసు నమోదు చేయించింది. 

నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో పేరుతో ఇప్పటికే అనేక కేసులు వేయించింది. ఇంకా మరో లక్ష కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. కేసులకు భయపడేవాడినే అసలు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనగలిగేవాడినా? 

ఈ ప్రభుత్వం ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు ఆచరణ సాధ్యం గాని అనేక హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేస్తోంది. రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేసి వారిని కూడా మోసం చేశారని అన్నందుకు నాపై యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయలేదా. ఇదీ అలాగే. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు,” అని అన్నారు. 

హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీ రాధాకిషన్ రావు ఇద్దరూ కలిసి తనను చాలా వేధించారని, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చక్రధర్ పిర్యాదులో పేర్కొన్నారు. 

ఆయన పిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఐటి చట్టంలోని సెక్షన్స్ 120 (బి), 386, 409, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.