మల్లారెడ్డికి ఈడీ షాక్: మెడికల్ కాలేజీ ఆస్తులు స్వాధీనం

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి చెందిన సుమారు రూ.4.5 కోట్లు విలువగల ఆస్తులు స్వాధీనం చేసుకొని, మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పీజీ కాలేజీ సీట్లని బ్లాకులో అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. 

మల్లారెడ్డి కాలేజీతో పాటు చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్‌కు చెందిన రూ.3.3 కోట్లు విలువగల ఆస్తులను, ఎంఎన్‌ర్‌ మెడికల్ కాలేజీకి చెందిన రూ.2 కోట్లు విలువగల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకొని వాటిపై కూడా కేసులు నమోదు చేసింది. 

మేనేజ్‌మెంట్ కోటాలో ఉండే కొన్ని సీట్లన్నీ నీట్ పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించిన విద్యార్దులతో భర్తీ అయిపోయాయని అబద్దాలు చెపుతూ ఆ సీట్లకు ధర పెరిగేలా చేసుకొని బ్లాకులో అమ్ముకుంటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. 

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మల్లారెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నప్పటికీ, తెలంగాణ టీడీపీలో చేరేందుకు సిద్దామవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా ఉన్నందున తెలంగాణ టీడీపీలో చేరి ఆయన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈడీ కేసుల నుంచి బయటపడాలని మల్లారెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తీగల కృష్ణారెడ్డి కూడా తెలంగాణ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.