లగచర్లలో భూసేకరణకు మళ్ళీ నోటిఫికేషన్‌ జారీ!

సిఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో ఫార్మా కంపెనీల కోసం లగచర్లలో భూసేకరణకు ప్రయత్నిస్తే రైతులు తిరుగుబాటు చేసి, అధికారులపై దాడులు కూడా చేశారు. రైతుల ఆగ్రహంతో వెనక్కు తగ్గి ఆ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకుంది.

తమ పోరాటాలు ఫలించినందుకు లగచర్ల గ్రామస్తులు సంబురాలు చేసుకుంటుండగానే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి టెక్స్ టైల్ తదితర పరిశ్రమలో కోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి 71.39 ఎకరాలు భూసేకరణకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇప్పటికే గ్రామస్యభలు నిర్వహించినందున ఈ భూసేకరణ కోసం మళ్ళీ గ్రామసభ నిర్వహించాల్సిన అవసరం లేదని అ నోటిఫికేషన్‌లోనే పేర్కొనడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు మళ్ళీ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై లగచర్ల, పోలేపల్లి రైతులు భగ్గుమంటున్నారు.

ప్రభుత్వం మళ్ళీ తమ భూముల జోలికి రాదనే అనుకున్నామని కానీ రెండు రోజుల వ్యవధిలో మరో నోటిఫికేషన్‌ జారీ చేసి తమ భూములు గుంజుకునేందుకు వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని రైతులు చెపుతున్నారు.