అలీ ఫామ్ హౌస్‌కి లైన్ క్లియర్

ప్రముఖ సినీ నటుడు అలీ ఫామ్ హౌస్‌కి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన వికారాబాద్‌ జిల్లా, నవాబుపేట మండలం,   ఎక్ మామిడి గ్రామశివారులో 5.22 ఎకరాల వ్యయసాయ భూమి కొనుగోలు చేసి ఫామ్ హౌస్‌ నిర్మించుకుంటున్నారు. కానీ వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయించుకోకుండా నిర్మాణం చేపట్టడంతో ఇటీవల గ్రామ కార్యదర్శి ఆయనకు నోటీస్ పంపారు. 

కనుక అలీ స్వయంగా సోమవారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి భూమార్పిడికి అవసరమైన పత్రాలపై సంతకం చేసి తహశీల్దార్ తులసీరాంకు సమర్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫామ్ హౌస్‌ నిర్మాణానికి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అవి లాంఛనప్రాయమే కనుక అలీ ఫామ్ హౌస్‌కి అన్ని  సమస్యలు తొలగిపోయిన్నట్లే భావించవచ్చు.

తెలుగు సినీ పరిశ్రమలో రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, అలీ, ధర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ముగ్గురూ వైసీపీలో ఉండేవారు. వారిలో రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి జగన్‌ అండ చూసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్ గురించి చాలా అవహేళనగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెట్టేవారు.

అందుకు వారిరువురూ కోర్టులు, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతుంటే, అలీ, పృధ్వీ వైసీపీలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉంచుకున్నందున ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. సినిమాలు చేసుకుంటున్నారు.