మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవలసిందే!

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసుపై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో నాగార్జున తర్వాత అశోక్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ, “భాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అందుకు నాగార్జున అభ్యంతరం చెప్పగానే ఆమె క్షమాపణలు కోరుతూ ట్వీట్‌ చేశారు. కానీ ఆమె తప్పుగా మాట్లాడానని నిజంగానే భావించి ఉంటే నాగార్జునకు నేరుగా ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పి ఉండేవారు. కానీ ఏదో మొక్కుబడిగా అన్నట్లు ట్వీట్‌ చేశారు. కనుక ఆమెలో ఎటువంటి అపరాధభావం లేదని స్పష్టం అవుతోంది.

ఆమె చేసిన వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం చాలా బాధ పడింది. సమాజంలో వారి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగింది. కనుక మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెపుతూ ట్వీట్‌ చేసినప్పటికీ ఖచ్చితంగా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవలసిందే,” అని వాదించారు. 

మంత్రి కొండా సురేఖ తరపున గురుప్రీత్ సింగ్‌ వాదిస్తున్నారు. నాగార్జున అభ్యంతరం చెప్పగానే ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పినందున ఈ కేసుని కొట్టివేయవలసిందిగా గురుప్రీత్ సింగ్‌ కోరారు.

కోర్టు విచారణ పూర్తయితే తీర్పు వెలువరిస్తుంది. కానీ అది మంత్రి కొండా సురేఖకి వ్యతిరేకంగా వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం ఖాయమే. కనుక ఇప్పటికిప్పుడు మంత్రి కొండా సురేఖకి ఈ కేసుతో ఎటువంటి ఇబ్బంది లేదనే భావించవచ్చు.