వరంగల్‌ అభివృద్ధికి రూ.4,962 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతోంది వరంగల్‌ నగరం. కేసీఆర్‌ హయాంలో వరంగల్‌ కొంత అభివృద్ధి చెందినా ఆశించిన స్థాయిలో జరగలేదనే చెప్పాలి. అందువల్లే భారీ వర్షాలు పడిన పడిన ప్రతీసారి వరంగల్‌ నగరం నీట మునుగుతుంటుంది.

రాష్ట్ర స్థాయిలో బిఆర్ఎస్, బీజేపీల మద్య రాజకీయవైరం కారణంగా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో కయ్యామాడుతూ కాలక్షేపం చేయడం జిల్లాలో  విమానాశ్రయం, మెగా టెక్స్ టైల్ పార్కులకి అవరోధంగా మారిందని చెప్పవచ్చు. 

ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి కూడ్డా కాంగ్రెస్‌ తరపున బీజేపీతో రాజకీయ యుద్ధాలు చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా ఉంటూ వరంగల్‌ మామునూరు విమానాశ్రయం సాధించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో విమానాశ్రయం కొరకు అదనంగా అవసరమైన భూసేకరణ కొరకు బడ్జెట్‌లో రూ.205 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌ నాగారంతో పోటీ పడే విదంగా వరంగల్‌ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం బడ్జెట్‌లో 161 కోట్లు, నగరంలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి ఏకంగా రూ.4,170 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. వరంగల్‌ అభివృద్ధికి మొత్తం రూ.4,962 కోట్లు కేటాయించారు.  

జిల్లా మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి చూపాలని చాలా పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయగలిగితే ఆ క్రెడిట్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకే సొంతం అవుతుంది.