వేములవాడ అభివృద్ధి పనులకు భూమిపూజ నేడే

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిలో రూ.76 కోట్లతో ఆలయ ఆవరణ విస్తరణ, భక్తులకు సదుపాయాల కల్పనకు వినియోగిస్తారు. 

మరో రూ.47.85 కోట్లు వ్యయంతో ఆలయం నుంచి మూలవాగు వంతెన వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడతారు. మిగిలిన రూ.3.8 కోట్లతో మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల్ కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడతారు. ఈ పనులను సిఎం రేవంత్‌ రెడ్డి నేడు బుధవారం) భూమిపూజ చేయనున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తర్వాత వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. 

అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొంటారు. ముందుగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్ధికసాయం (చెక్కులు) అందిస్తారు. సభ ముగిసిన తర్వాత నేతన్నల కోసం రూ.50 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసిన నూలు బ్యాంక్‌ని ప్రారంభిస్తారు.

వేదిక మీద నుంచే వర్చువల్ పద్దతిలో రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు.