పాపం కాంట్రాక్ ఉద్యోగులు: ఆ జీవో రద్దు!

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ని హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో వివిద ప్రభుత్వ కార్యాలయాలలో మొత్తం 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది.

వారిలో 2,909 మంది లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, వైద్య ఆరోగ్యశాఖలో 837 మంది వైద్య సిబ్బంద, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు ఉన్నారు.

వీరందరూ చాలా ఏళ్ళుగా తక్కువ జీతాలకు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తుండటంతో వారి అభ్యర్ధన మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం వారి ఉద్యోగాలను క్రమబదీకరించింది. కానీ ఆ ప్రక్రియ ముగిసేలోగా కేసీఆర్‌ అధికారం కోల్పోవడంతో కొందరు ప్రభుత్వోద్యోగులు ఈ క్రమబద్దీకరణని సవాలు చేస్తూ హైకోర్టులో కేసులు వేయడంతో ఆ ప్రక్రియ అర్దాంతరంగా నిలిచిపోయింది.ఇప్పుడు హైకోర్టు తీర్పుతో పూర్తిగా నిలిచిపోయింది.

కానీ ఇప్పటికే ఉద్యోగాలు క్రమబద్దీకరణ అయినవారు చాలా అదృష్టవంతులే అని భావించవచ్చు. వారి ఉద్యోగాలకు ఈ ఆదేశం వర్తించదని వారు యదాతధంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది.

కానీ ఇకపై ప్రభుత్వం ఎన్నడూ జీవోలు జారీ ఉద్యోగాలు క్రమబద్దీకరించే ఆలోచన కూడా చేయవద్దని, తప్పనిసరిగా ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్‌ జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఇంతకాలం తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించబడతాయని, తాము కూడా ప్రభుత్వోద్యోగుల్లా దర్జాగా సుఖంగా జీవించవచ్చని ఆశపడిన మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇది తీవ్ర నిరాశ కలిగిస్తుంది. వారి పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది.