కేసీఆర్‌ అనే కలుపు మొక్కని పీకేస్తా: రేవంత్‌

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం సాయంత్రం హనుమకొండ  ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“మా ప్రభుత్వం రేయింబవళ్లు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంటే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని కిరాయి మూకలతో అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కేసీఆర్‌ తన కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు కానీ పదేళ్ళలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయడానికి మనసొప్పలేదు. 

కేసీఆర్‌ పదేళ్ళలో రుణమాఫీ చేయలేదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే రుణమాఫీ చేస్తుంటే అసూయతో మాపై విశాం కక్కుతున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలననే రుణమాఫీ కాలేదు కానీ అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాను. 

కేసీఆర్‌కి ఒక్కసారి అధికారం పోగానే ఫామ్‌హౌస్‌లో దాక్కొన్నారు. అదే మా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు ఓడిపోయినా ప్రజల మద్యనే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నారు. 

అంటే కేసీఆర్‌కి ముఖ్యమంత్రి పదవి, అధికారం లేకపోతే ప్రజల మద్యకు రారు. శాసనసభ సమావేశాలకు రారన్న మాట! ఫామ్‌హౌస్‌లో కూర్చొని మా ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలా అని కుట్రలు చేస్తుంటారన్న మాట! 

నాడు కేసీఆర్‌ని ఓడిస్తానని చెప్పా ఓడించాను. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కనీయనని చెప్పా దక్కనీయలేదు. ఇప్పుడు మళ్ళీ చెపుతున్నా... రాష్ట్రంలో కేసీఆర్‌ అనే కలుపు మొక్కని మళ్ళీ మొలవనీయను. కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు, నక్క జిత్తులు అన్నీ నాకు బాగా తెలుసు. ఆయనకి ఏవిదంగా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు. 

ఇప్పటికైనా కేసీఆర్‌కి దమ్ముంటే శాసనసభకు రావాలి. వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలని నేను సవాలు విసురుతున్నాను. ఆయన ఎన్ని కుట్రలు చేస్తున్నా తెలంగాణ అభివృద్ధి ఆగేది లేదు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తాము. 

ఇరుగు పొరుగు రాష్ట్రాలకు నాలుగైదు విమానాశ్రయాలున్నాయి. కానీ మనకి ఒకటే ఎందుకుంది? అని కేసీఆర్‌ ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేము వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకి గట్టిగా కృషి చేస్తున్నాము. తప్పకుండావిమానాశ్రయం వస్తుంది. వరంగల్‌ హైదరాబాద్‌ నగరానికి తీసిపోని విదంగా అభివృద్ధి చేసి చూపిస్తాము,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

 (Video Courtecy: TV9 Telugu)