లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ తదితర అధికారులపై జరిగిన దాడి కేసులో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యి, ప్రస్తుతం చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ సాధారణ ఖైదీలతో కలిపి తనను బ్యారక్‌లో ఉంచడం సరికాదని, వేరే బ్యారక్‌లోకి మార్చాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించి చర్లపల్లి జైలు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయన అభ్యర్ధన మేరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నన్ని రోజులు ఇంటి నుంచి వచ్చే భోజనం అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది.
ఈ దాడి కేసులో ప్రధాన నిధితుడు కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందినవాడే. అతనికి లగచర్లలో ఎటువంటి భూమి లేదు. కానీ అతను జిల్లా కలెక్టర్‌ని ఒప్పించి లగచర్లకు వచ్చేలా చేసి అక్కడ ఆయనపై గ్రామస్తులతో దాడి చేయించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాడికి ముందు తర్వాత పట్నం నరేందర్ రెడ్డి సురేష్‌తో 42 సార్లు ఫోన్లో మాట్లాడారని, కనుక ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఆయనే అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపారు. బెయిల్ లభించనందున రెండు వారాలు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కనుక ప్రత్యేక బ్యారక్ దొరికినందుకే పట్నం నరేందర్ రెడ్డి సంతోషపడక తప్పదేమో?