అర్వింద్ కేజ్రీవాల్‌కి షాక్: రవాణామంత్రి రాజీనామా

ఆమాద్మీ పార్టీకి, ఢిల్లీ ప్రభుత్వానికి రవాణా, ఐ‌టి, హోం, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి కైలాష్ గహ్లోత్ షాక్ ఇచ్చారు. శనివారమే ఆయన ఢిల్లీలో సఖీ బస్ డిపోని ప్రారంభించి, స్టేట్ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలని సావధానంగా విని ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ఆదివారం ఉదయం ఆయన తన మంత్రి పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీ చేశారు. పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు పంపిన రాజీనామా లేఖలో “మనం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము కానీ వాటిని అమలు చేయలేకపోయాము. మనం అధికారంలోకి వస్తే యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కానీ ఇంతవరకు మన ప్రభుత్వం యమునా నది వైపు చూడలేదు కూడా. ఇదివరకటి కంటే యమునా నది మరింత కలుషితమైపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రజల కోసం పనిచేయాల్సిన మనం పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము. ప్రజల కంటే పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో నేను పార్టీలో, పదవిలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే తమ ప్రభుత్వాన్ని ఏవిదంగా అప్రదిష్టపాలు చేసి పడగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్న బీజేపీ నీచ రాజకీయాల వలననే కైలాష్ గహ్లోత్ పార్టీని వీడుతున్నారని తమకు తెలుసని అర్వింద్ కేజ్రీవాల్‌ అన్నారు.