హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు 2025, జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టులో వేగంగా పూర్తిచేయగల అవకాశం ఉన్న ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట కారిడార్-6 పనులను ముందుగా ప్రారంభించలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కారిడార్ పొడవు 7.5 కిమీ పరిధిలో మెట్రో స్టేషన్లు వగైరా నిర్మించేందుకు వీలుగా ఇరువైపులా గల 200 ప్రైవేట్ స్థలాలను సేకరించవలసి ఉంటుంది. దీని కోసం హైదరాబాద్ కలెక్టర్ డి.అనుదీప్ శనివారం ప్రాధమిక డిక్లరేషన్ జారీ చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా భూసేకరణ పనులు పూర్తిచేసి జనవరి నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రక్షణశాఖ అధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఆ భూములు అప్పగించగానే సికింద్రాబాద్-కండ్లకోయ మద్య 18.3 కిమీ, సికింద్రాబాద్-షామీర్ పేట మద్య 11.3 కిమీ పొడవుగల రెండు ఎలివేటడ్ కారిడర్లు నిర్మించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణకు వచ్చే వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.