మల్లారెడ్డికి ఇంత భూదాహం దేనికో?

రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి త్వరగా ఆస్తులు పోగేసుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ మితిమీరితే దొరికిపోతామని తెలిసి కూడా బరి తెగించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలు, అక్రమ కట్టడాల కధలు కధలుగా మీడియాలో తరచూ వస్తూనే ఉన్నాయి. ఆయన కాలేజీలలో డొనేషన్స్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ ఆదాయపన్నుశాఖ దాడులు చేయగా, పీజీ మెడికల్ సీట్స్ బ్లాకులో అమ్ముకున్నారంటూ ఈడీ కేసు నమోదు చేస్తోంది. తాజాగా మల్లారెడ్డికి సంబందించి మరో వ్యవహారం బయట పడింది. 

నర్సింహా రెడ్డి అనే 87 ఏళ్ళ వృద్ధుడు నిన్న హైదరాబాద్‌, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ మాజీ మంత్రి మల్లారెడ్డి తనని మోసం చేశారని ఆరోపించారు. శామీర్ పేట మండలం యాడారం సర్వే నంబర్‌ 249,250 ఏలో తనకు 9 ఎకరాల 29 గుంటల భూమి ఉందని, దానికి మల్లారెడ్డి రూ.21.88 కోట్లు చెల్లించి కొనుకుంటానని ముందుకు రావడంతో అగ్రిమెంట్ చేసుకున్నానని చెప్పారు.

మల్లారెడ్డి తనకు రూ. 8.3 కోట్లు చెల్లించి మిగిలిన మొత్తానికి చెక్ ఇచ్చి భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. కానీ ఆ చెక్ బౌన్స్ అవడంతో తాను ఆ డబ్బు కోసం దాదాపు నెలన్నర రోజులుగా మల్లారెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నానని, కానీ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని నర్సింహా రెడ్డి చెప్పారు.

గట్టిగా నిలదీసి అడిగితే తన అనుచరులతో వేధిస్తున్నారని, ఎదురు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతానని బెదిరిస్తున్నారని నర్సింహా రెడ్డి కన్నీళ్ళు పెట్టుకొని చెప్పారు.

తాను మల్లారెడ్డి అంతటివాడిని ఎదుర్కొని నిలబడలేనని కనుక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకొని తన సొమ్ము తనకి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ చూస్తే మల్లారెడ్డి ధనదాహం, భూదాహం ఎన్నటికీ తీరదా?అని అనిపించక మానదు.