కేటీఆర్‌ ఇంటర్వ్యూలలో పదేపదే అరెస్ట్ ప్రస్తావన!

ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారం, తాజాగా లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

మంత్రులు కూడా కేటీఆర్‌ అరెస్ట్ తప్పదని చెపుతూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తుండటం విశేషం. వాటిలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తనని అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని, రైతులు, ప్రజల కోసం తాను వందసార్లు జైలుకి వెళ్ళేందుకు సిద్దమని చెప్పారు. 

సిఎం రేవంత్‌ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతులు ఎదురు తిరగడంతో పరాభవం జరిగిందని దానిని కప్పిపుచ్చుకొనేందుకు, బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందనే కొత్త డ్రామా ఆడుతూ, ప్రజలను నమ్మించేందుకే బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. 

లగచర్లలో నిరుపేద రైతులు తమ భూములు పోతాయనే ఆందోళనతో గత 9 నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నారని కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వారి గోడు వినేవారు ఎవరూ లేకపోవడంతో ఆందోళన ఉదృతం చేశారని కేటీఆర్‌ అన్నారు. 

తమ భూముల కోసం పోరాడుతున్న ఆ రైతులకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని తాము భరోసా ఇచ్చామని కేటీఆర్‌ అన్నారు. కనుక రైతుల తరపున పోరాడుతున్న మా పార్టీకి చెందిన సురేష్‌తో మా పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడితే తప్పేమిటని, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నేను ఆయనతో మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి తనను ఏ కేసు పేరుతో అరెస్ట్ చేయించిన న్యాయపోరాటం చేసి నిజం నిరూపిస్తానని దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని కేటీఆర్‌ సవాల్ విసిరారు. కేటీఆర్‌ తాజా ఇంటర్వ్యూ ముగింపులో ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. ఓ వ్యక్తి రెండుసార్లు కంటే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవి చేపట్టకూడదని ఎన్నికల సంస్కరణలు చేయాలన్నారు.