లగచర్ల గొడవలతో నాకు సంబంధం లేదు: పట్నం

ప్రస్తుతం చర్లపల్లి జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. లగచర్లలో జరిగిన గొడవలతో తనకు ఎటువంటి సంబందమూ లేదని కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు తనని అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

భూసేకరణలో భూములు కోల్పోతామనే ఆందోళనతోనే రైతులు దాడులు చేశారు తప్ప వారి దాడితో తనకు, బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

కానీ దిగువకోర్టులో తన వాదనలు వినకుండానే పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్ ఆధారంగా తనకి జ్యూడిషియల్ రిమాండ్‌ విధించిందని పేర్కొన్నారు. కనుక  రాజకీయ దురుదేశ్యంతో బొమరాస్‌పేట్‌ స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసుని కొట్టివేసి తనకు జైలు నుంచి విముక్తి కల్పించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. న్యాయస్థానం దానిని విచారణకు స్వీకరించింది. బహుశః సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

కానీ పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ దాడిలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సురేష్, అతని సోదరుడు మహేష్‌కి ఎటువంటి భూములు లేవని పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న 42 మంది నిందితులలో 17 మంది భూములు లేవని, వారిలో కొందరు పొరుగు ఊర్ల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌ తదితరులపై పక్కా ముందస్తు పధకం ప్రకారమే దాడి చేశారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి సురేష్‌తో 42 సార్లు ఫోన్‌లో మాట్లాడారని పేర్కొన్నారు. పోలీసులు విచారణ జరిపిన పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పిస్తామని తెలిపారు.