తొలిసారిగా తిరుమల దర్శించుకున్న కేజ్రీవాల్‌

ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ నేడు భార్య సునీత, తల్లితండ్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు బుధవారం సాయంత్రమే హైద్రాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. వారికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి కొండపై బస చేసి, ఈరోజు ఉదయమే అందరూ కలిసి  స్వామివారి దర్శనం చేసుకొని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

అర్వింద్ కేజ్రీవాల్‌ దంపతులు వారి జీవితంలో తొలిసారిగా తిరుమలకు వచ్చారు. కొండపై నెలకొన్న ఆధ్యాత్మికత, పచ్చటి చెట్లతో నిండిన ఏడుకొండలు, రమణీయమైన దృశ్యాలు , భక్తుల వసతి, భోజన సౌకర్యాల కోసం చేసిన ఏర్పాట్లు అన్ని పరిశీలించి అబ్బురపడ్డారు. తిరుమల అద్భుతంగా ఉందని, ఇన్నేళ్ళకు స్వామివారిని దర్శించుకోగలిగామని అన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు రాగానే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను నిర్దోషినని ప్రజలు కూడా భావించి ఎన్నికలలో మళ్ళీ గెలిపిస్తేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోంటానని అర్వింద్ కేజ్రీవాల్‌ శపధం చేసి, అప్పటి నుంచి ప్రజల మద్య తిరుగుతూ మోడీ ప్రభుత్వం తనని ఏవిదంగా అన్యాయంగా ఈ కేసుని సృష్టించి ఇరికించిందో వివరిస్తూ వారి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.