వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీల కొరకు భూసేకరణ విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని రాజకీయాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వెనక్కు తగ్గబోదని సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ ఇన్చార్జి తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి రెడ్డి నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి గ్రామస్తుల దాడికి గురైన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులను పరామర్శించి, పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, “కొడంగల్‌కు మా సోదరుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే కారణంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడంగల్‌ని అభివృద్ధి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను తీసుకువచ్చి పరిశ్రమలు స్థాపింపజెసి స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసి అడ్డుపడుతోంది.
బిఆర్ఎస్ నేతలే గ్రామస్తులను రెచ్చగొట్టి జిల్లా అధికారులపై దాడులు చేయించారు. జిల్లా అధికారులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ దాడుల వెనుక ఎవరున్నా విడిచి పెట్టే ప్రసక్తే లేదు. అలాగే బిఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా లగచర్లలో ఫార్మా కంపెనీలు, ఇంకా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని, జిల్లాని అభివృద్ధి చేసి తీరుతాము.
మల్లన్నసాగర్ కోసం హరీష్ రావు గ్రామస్తులను బెదిరించి భయపెట్టి రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు. కానీ చలగర్ల భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ ఆవిదంగా బెదిరించడం లేదు. తొందరపెట్టడం లేదు. గ్రామస్తులను ఒప్పించి వారి సమ్మతంతోనే భూసేకరణ చేపడుతుంది. ఇక్కడ పరిశ్రమలు వస్తే అనేకమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది,” అని తిరుపతి రెడ్డి అన్నారు.