చర్లపల్లి జైలుకి పట్నం నరేందర్ రెడ్డి

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్‌ కోర్టు రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయనని చర్లపల్లి జైలుకి తరలించారు. వికారాబాద్‌ జిల్లాలో లగచర్లలో జిల్లా కలెక్టర్‌ తదితరులపై గ్రామస్తుల దాడితో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని భావిస్తున్న పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జయలుకి తరలించారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త సురేష్‌ని ఏ-1గా పేర్కొన్నారు. పరారీలో ఉన్న సురేష్‌తో సహా మరో నాలుగురిని నేడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డితో సహా మొత్తం 16 మంది జైల్లో ఉన్నరిప్పుడు.  

ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు నుంచి జైలుకి తరలిస్తుంటే భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకొని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకి తరలించారు.