బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్‌, కేబీఎన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్‌ తదితర అధికారులపై గ్రామస్తుల దాడి కేసులో ఆయనని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిలో 31 మందిని నిందితులుగా చేర్చారు.

 జిల్లా కలెక్టర్‌ తదితరులను లగచర్ల గ్రామానికి రప్పించి అక్కడ కర్రలు, రాళ్ళతో వారిపై దాడి చేయించినందుకు సురేష్ అనే వ్యక్తిని ఈ కేసులో ఏ-1గా పేర్కొన్నారు. కానీ దాడి జరిగిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

బిఆర్ఎస్ పార్టీయే గ్రామస్తులను రెచ్చగొట్టి దాడి చేయించిందని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఈరోజు ఉదయం ఫిలిమ్ నగర్‌ వద్ద కేబీఆర్ పార్కులో ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

బిఆర్ఎస్ పార్టీ ఆయన అరెస్టుని ఖండిస్తోంది. లగచర్ల గ్రామస్తుల ఆగ్రహంతో షాక్ అయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ దాడిని తమకి ఆపాదించేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్‌, హరీష్ రావు ఆరోపిస్తున్నారు.