కేటీఆర్‌ అరెస్ట్ భయంతోనే ఢిల్లీలో: రేవంత్‌

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని తేల్చి చెప్పేశారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ అరెస్ట్ కావడం ఖాయం. గవర్నర్‌ అనుమతి లభించగానే కేటీఆర్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ భయంతోనే కేటీఆర్‌ ఢిల్లీకి పారిపోయి వచ్చి ఇక్కడ కేంద్రమంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

బీజేపీ అవినీతి పార్టీ అని దానికి ఓట్లు వేయవద్దని మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన కేటీఆర్‌, ఇప్పుడు అదే బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారంటే అర్ధం ఏమిటి? బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య అవగాహన ఉందనే కదా?కేటీఆర్‌ అరెస్ట్ విషయంలో కేంద్రం అడ్డుపుల్ల వేస్తే ఆ రెండు పార్టీల  మద్య బందం బయటపడుతుంది,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

అమృత్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, సిఎం రేవంత్‌ రెడ్డి తన బావమరిదికి చెందిన సోదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి రూ.1,137 కోట్ల విలువైన పనులు దక్కేలా చేశారని కేటీఆర్‌ మొన్న కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.

దీనిపై సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, “పేరు చివర రెడ్డి ఉన్నవాళ్ళు అందరూ నా బావమరుదులు అయిపోరు. కేటీఆర్‌ చెపుతున్న సృజన్ రెడ్డి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడే. కేసీఆర్‌ హయాంలోనే సృజన్ రెడ్డి కంపెనీకి అక్రమంగా వేలకోట్ల కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. 

అతనితో నాకు ఎటువంటి సంబందమూ లేదు. నేను ఎవరికీ లబ్ధి కలిగించలేదు. అమృత్ టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. ఈ విషయంలో కేటీఆర్‌ ఎవరికి ఫిర్యాదు చేసుకున్నా, కోర్టులో కేసులు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.