సిఎం ఇలాకాలోనే అల్లర్లు, విధ్వంసం!

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలో అల్లర్లు జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దుద్యాల మండలంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకి భూసేకరణ చేసేందుకుగాను లగచర్ల గ్రామంలో సోమవారం గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకున్నారు. 

దానిలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్, అధనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, సబ్ కలెక్టర్‌ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఆధారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి సోమవారం ఉదయం అక్కడికి కార్లలో చేరుకున్నారు. 

అప్పటికే వారి కోసం కాపు కాసి సిద్దంగా ఉన్న కొందరు వారి వాహనాలను అడ్డుకొని రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి గాయపడగా మిగిలినవారు తప్పించుకుని తిరిగి వెళ్ళిపోయారు. 

ఈ దాడికి పాల్పడినవారిలో 55 మందిని పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారందరూ రైతులే అని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా, రైతుల పేరుతో బిఆర్ఎస్ పార్టీ గూండాలే అధికారులపై దాడులకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ వాదిస్తోంది. 

ఈ దాడి కారణంగా రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుంటే, మరోపక్క లగచర్లలో భారీగా పోలీసులను మోహరించి అరెస్టులు చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జిల్లా కలెక్టర్ తదితర అధికారులపై దాడులను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దాడులకు పాల్పడినవారినే కాకుండా విచారణ జరిపించి వారిని ప్రోత్సహించినవారిపై కూడా కేసులు నమోదు చేయాలని భావిస్తోంది.