తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర పట్టంహాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వ అమృత్ పధకంలో భాగంగా రూ.8,888.51 కోట్లు విలువైన పనులకు ఆమోదం తెలుపగా సిఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వాటిలో రూ.1,137 కోట్ల విలువైన పనులు తన బావమరిదికి చెందిన సోదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి దక్కేలా చేశారని కేటీఆర్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి బంధుప్రీతితో వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. తద్వారా ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నిబందనని ఉల్లంఘించారని, అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 191(1)ని కూడా ఉల్లంఘించారని కేటీఆర్ ఫిర్యాదు చేశారు.
ఇదివరకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇదేవిదంగా ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నిబందన ఉల్లంఘించినందుకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్రమంత్రికి గుర్తు చేశారు. కనుక అమృత్ పధకం కింద జారీ చేసిన ఆ టెండర్లను రద్దు చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్‌తో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బాల్క సుమన్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు.