సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేడు ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్లు, ఈవీఎంల ప్రామాణికత, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు వంటి కీలకమైన కేసులలో తీర్పులు ఇచ్చారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించారు. ఆ తర్వాత నేషనల్ లీగల్ సర్వీస్ ఆధారిటీ (నల్సా)కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేశారు.
1988లో ఢిల్లీ బార్ కౌన్సిల్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేయించుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
సీనియారిటీ ప్రకారం జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఇప్పుడు ఈ సర్వోన్నత పదవి లభించింది. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2025, మే 13వరకు కొనసాగుతారు.