శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమితో కంగుతిన్న మాజీ సిఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవడంతో ఎవరికీ కనబడటం లేదు. ఆయన గొంతు వినపడటం లేదు. శనివారం తొలిసారిగా ఆయన తన ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు మీడియాలోకి రావడంతో వైరల్ అవుతున్నాయి.
పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం ఫామ్‌హౌస్‌కి వచ్చి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజలు అధికారం ఇచ్చేది బాధ్యతతో పనిచేయడానికి. అందరికీ మంచి చేయడానికి తప్ప వారి ఇళ్ళు కూల్చడానికి కాదు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో గెలిచేందుకు ఇష్టం వచ్చిన్నట్లు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఇచ్చిన హామీలను అమలుచేయకపోగా హైడ్రాతో ప్రజలను భయపెడుతున్నారు. కేసులు పెట్టి అరెస్టు చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నోటికి వచ్చిన్నట్లు మమ్మల్ని తిడుతూ ఇంకా మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారు.
ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ళలో మొదటి 6 నెలలు పూల బోకెలు, అభినందనలతో గడిచిపోతుంది. చివరి 6 నెలలు ఎన్నికల హడావుడితో గడిచిపోతుంది. కనుక మిగిలిన నాలుగేళ్ళ సమయంలోనే ఏమైనా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది?ఇళ్ళు కూల్చడం తప్ప?
ప్రజలు కాంగ్రెస్ పాలనని గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ని ఎన్నుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారు కూడా. ఏం కోల్పోయామో అర్దం చేసుకుంటున్నారు. కనుక బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరూ నిరుత్సాహపడక్కరలేదు. మళ్ళీ మనమే తప్పకుండా అధికారంలోకి వస్తాము. ప్రజలే మనకి అధికారం ఇస్తారు. మనం కాస్త ఓపిక పట్టాలి అంతే!” అని కేసీఆర్ అన్నారు.