దటీజ్ పవన్ కళ్యాణ్

నోట్ల రద్దు వలన సామాన్యులే తప్ప నల్లధనం పోగేసుకొన్న రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు, ప్రముఖులు ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడటం లేదని అందుకే వారెవరూ బ్యాంకులు, ఎటిఎంల దగ్గర క్యూ లైన్లలో కనబడటం లేదని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అది నిజం కూడా. ఎందుకంటే ఒక స్థాయికి చేరుకొన్న వారెవరికీ రూ.4-5,000 కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్లో నిలబడవలసిన అవసరమే ఉండదు. కావాలనుకొంటే వారి దగ్గర పనిచేసే ఉద్యోగులే తెచ్చిపెట్టగలరు లేదా క్రెడిట్ కార్డులతోనే అన్ని పనులు చక్కబెట్టుకోగలరు.

కానీ నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్, ఇవ్వాళ్ళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా బ్యాంకులకి వచ్చి తమ వద్ద ఉన్న పాతనోట్లని మార్చుకొన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో తన ఖాతా ఉన్న బ్యాంక్ కి వెళ్ళి అక్కడ ఫారం నింపి, తన వద్ద ఉన్న పాత నోట్లని ఇచ్చి కొత్తవి తీసుకొని వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బ్యాంక్ కి వచ్చిన విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాలల నుంచి ఆయన అభిమానులు బ్యాంక్ దగ్గరకి చేరుకోవడంతో వారి వలన క్యూ లైన్లో ఉన్న ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ ఐదు నిమిషాలలో తన పని ముగించుకొని వెళ్ళిపోయారు.