ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల నుంచి వైసీపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని తెలిసి ఉన్నా అల్లు అర్జున్ ముందస్తు అనుమతి తీసుకోకుండా భారీ ఊరేగింపుగా తన స్నేహితుడు ఇంటికి వెళ్ళారు. అక్కడ అతని ఇంట్లో బాల్కనీలో నిలబడి తన స్నేహితుడిని గెలిపించాలన్నట్లు విజ్ఞప్తి చేశారు.
కనుక నంద్యాల డెప్యూటీ తహశీల్దార్ రామచంద్రరావు ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వారిరువురూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించగా నేడు వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు నమోదు చేసిన కేసుని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారిరువురికీ ఉపశమనం లభించిన్నట్లయింది.
ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో స్వయంగా వచ్చి మద్దతు తెలిపినా టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ప్రభంజనంలో రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఎన్నికలలో ఓడిపోయారు.