వరంగల్‌ విమానాశ్రయానికి డెడ్‌లైన్‌ మూడేళ్ళు!

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తానికి శంషాబాద్ వద్ద ఒకేఒక విమానాశ్రయం ఉండటం ఆలోచించవలసిన విషయమే. పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ కూడా వరంగల్‌ విమానాశ్రయం గురించి గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో తగువు పెట్టుకోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైపోయాయి. 

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్ళీ దాని గురించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ వరంగల్‌కి విమానాశ్రయంతో పాటు రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాదించుకునేందుకు కృషి చేస్తున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగాణే స్పందిస్తోంది. ఇప్పటికే మామునూరులో విమానాశ్రయం నిర్మాణానికి కొంత భూమి అందుబాటులో ఉన్నప్పటికీ మరో 300-400 ఎకరాలు అవసరం ఉంటుంది. 

కనుక భూసేకరణ పనులు పూర్తిచేసి విమానాశ్రయం నిర్మాణానికి చురుకుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. మూడేళ్ళలో మామునూరు విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తిచేయడమే కాకుండా హైదరాబాద్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్య నగరాలు, పట్టణాలకు విమానాలు నడిపించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ఉడాన్’ పధకాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.

 ఇక నుంచి ప్రతీ రెండు వారాలకు ఒకసారి సమావేశమవుతూ మామునూరు విమానాశ్రయ పురోగతిని సమీక్షిస్తానని, ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వం తరపున వాటిని తొలగించేందుకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది కనుక మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.