ఏపీలో సీ-ప్లేన్ సర్వీసులు మొదలవుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిని పట్టించుకోకుండా వదిలేశారు. అలాగే పోలవరం పనులు కూడా నత్తనడకన సాగాయి. అభివృద్ధికి బదులు జగన్‌ సంక్షేమ పధకాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయి అన్ని విధాలుగా వెనుకబడిపోయింది. 

కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రాన్ని గాడి తప్పిన వ్యవస్థలను అన్నిటినీ చకచకా సరిచేస్తున్నారు. ఇంకా 5 నెలలు పూర్తికాక ముందే చంద్రబాబు నాయుడు చాలా చురుకుగా అభివృద్ధి పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు సమకూర్చుకొని త్వరలో మళ్ళీ పనులు మొదలుపెట్టించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చు. మూడేళ్లలో అంటే 2027నాటికి అమరావతి దాదాపు సిద్దం అవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు.  

అనకాపల్లి జిల్లాలో సుమారు రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ భాగస్వామ్యంలో స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తవగానే రెండో దశలో మరో 60-70,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌లో విస్తరణ చేపడతాయి. 2026లోగా మొదటి దశ ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు చెపుతున్నాయి.

ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు విజయవాడ కృష్ణానదిలో నీటి మీద ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సీ-ప్లేన్ సర్వీసులు ప్రారాభించబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఇదే తొలి సీ-ప్లేన్ సర్వీసులుగా నిలుస్తాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ ప్లేన్‌లో శ్రీశైలం వెళ్ళనున్నారు. 

గత5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వెనుకబడిపోయినందుకు ఎంతగానో బాధ పడుతున్న రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇంత చురుకుగా అభివృద్ధి పనులు ప్రారంభం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు.