తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అమలు చేసేందుకు హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమీషన్‌కు కార్యదర్శిగా గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులుని నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక సంస్థల పరిధిలో బీసీలలో వెంకబాటుతనం, దాని స్వభావం అంటే ఆర్ధికంగానా, సామాజికంగానా లేదా విద్యా, ఉద్యోగ ఉపాధి పరంగానా అనేది ఈ కమీషన్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే బీసీ రిజర్వేషన్లని వర్తింపజేయడంలో రాజ్యాంగంలో నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అధ్యయనం చేసి, వీటిని అమలుచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం లేకుండా తగిన సిఫార్సులు చేయడం ఈ కమీషన్ బాధ్యతగా జీవోలో పేర్కొన్నారు.
బూసాని వేంకటేశ్వర రావు కమీషన్‌కు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది.