రేవంత్‌ పాదయాత్రలో హరీష్ పాల్గొంటారా?

మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న భిన్నవాదనలు, పరస్పర విమర్శలు అందరూ వింటూనే ఉన్నారు. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే ఓసారి మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించి ఇళ్ళు కోల్పోతున్న బాధితులతో మాట్లాడాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాలు విసిరారు. సిఎం రేవంత్‌ రెడ్డి దానిని స్వీకరిస్తున్నట్లు ప్రకటించడమే కాక కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు కూడా తనతో కలిసిరావాలని ప్రతి సవాల్ విసిరారు. 

ఈ నెల 8వ తేదీన సిఎం రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొన్న తర్వాత మూసీపరీవాహక ప్రాంతాలలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రకు సంబందిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ముందుగా భువనగిరి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దారిలో భువనగిరి,. ఆలేరు నియోజకవర్గాలకు త్రాగునీటిని అందించే పైప్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మొసీ పరీవాహక ప్రాంతాలలో పర్యటించి అక్కడ నివశిస్తున్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 

మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల వద్దకు బిఆర్ఎస్ నేతలు వెళ్ళి సంఘీభావం తెలిపి వారికోసం ప్రభుత్వంతో పోరాడుతామని హామీ ఇచ్చారు. సిఎం రేవంత్‌ రెడ్డికి సవాలు కూడా విసిరారు. ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజల వద్దకు వెళుతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి ప్రజల వద్దకు వెళ్తారా లేదా ఏదో కుంటిసాకు చెప్పి తప్పించుకుంటారా?