ఝార్ఖండ్ ఎన్నికలకి బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

ఈ నెల 13,20 తేదీలలో రెండు విడతలలో ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి ఝార్ఖండ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ చాలా పట్టుదలగా ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఝార్ఖండ్‌లో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాంచీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి అమలులోకి తెచ్చి విదేశీ చొరబాటుదారులను తరిమికొట్టి గిరిజన ఆడబిడ్డలను, వారి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, ప్రతీ మహిళకు నెలకు రూ.2,100 పింఛన్, ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. 

ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలున్నాయి. ఈ నెల 13,20 వ తేదీలలో పోలింగ్‌ నిర్వహించి, 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.