రాజ్యసభలో నోట్ల యుద్ధం

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. లోక్ సభ సభ్యుడు రేణుక సిన్హా మృతికి సంతాపం తెలిపిన తరువాత లోక్ సభ రేపటి వాయిదా పడింది. కానీ రాజ్యసభ కార్యక్రమాలు యధావిధిగా సాగుతున్నాయి. ఊహించినట్లుగానే రాజ్యసభ సమావేశాలు మొదలవగానే నోట్లరద్దుపై ప్రతిపక్షాలు నోటీసులు ఇవ్వడంతో దానిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి. 

కాంగ్రెస్ సభ్యుడు ఆనంద శర్మ మాట్లాడుతూ, “నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్రప్రభుత్వం చేపట్టే ఎటువంటి చర్యకైనా మేము మద్దతిస్తాము. కానీ నోట్ల రద్దుని సమర్ధించలేము. దాని వలన దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. కేంద్రప్రభుత్వం చాలా అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకొంది. దీని వలన భవిష్యత్ లో ఎటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ఊహించలేకుండా ఉంది. అందుకే తన నిర్ణయాన్ని సమర్ధించుకొంటోంది. అసలు ప్రజలని తమ ఖాతాలలో ఉన్న డబ్బుని తీసుకోవద్దని చెప్పే అధికారం ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు. 

“నోట్ల రద్దు వలన ధనికులు ఎవరూ ఇబ్బందులు పడటం లేదు. కేవలం సామాన్యపౌరులే ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కేంద్రప్రభుత్వం తీసుకొన్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులని పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి,” అని ఆనంద శర్మ కోరారు. ప్రతిపక్షాల సభ్యులు కూడా మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరారు. 

కానీ మోడీ ప్రభుత్వం వారికి చాలా ధీటుగా బదులిస్తోంది. ఇందన శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ “దేశంలో నల్లధనం దాచుకొన్న వారే దెబ్బవుతున్నారు తప్ప సామాన్యులు నష్టపోవడం లేదని, కానీ తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని అన్నారు. దేశ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొనే తమ ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొందని, దాని పూర్తి ప్రయోజనం నెరవేరాలనే ఉద్దేశ్యంతోనే ఆకస్మిక ప్రకటన చేయవలసి వచ్చిందని తెలిపారు. సామాన్య ప్రజలకి ఎటువంటి నష్టంకలగకూడదనే ఉద్దేశ్యంతోనే డిశంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. దేశంలో అన్ని బ్యాంకులకి రోజూ కొత్తనోట్లు పంపిస్తునందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా క్రమంగా తొలగిపోతాయని చెప్పారు. దేశంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో తప్ప చాలా చోట్ల ఈ ఇబ్బందులు తగ్గుముఖం పడుతున్నట్లు తమకి సమాచారం అందుతోందని చెప్పారు. రానున్న కొద్ది రోజులలో ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుందని అన్నారు. దేశహితం కోసం తీసుకొన్న ఈ నిర్ణయానికి ప్రతిపక్షాలు అన్నీ మద్దతు ఇవ్వవలసినదిగా పీయూష్ గోయల్ కోరారు.