జనసేనలో నరసింహ వారాహి గణం!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ‘సనాతన ధర్మ పరిరక్షణ’ గురించి మాట్లాడుతూ, దీని కోసం తిరుపతిలో  ‘వారాహి డిక్లరేషన్’ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీసులతో జనసేన పార్టీలో ‘నరసింహ వారాహి గణం’ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, “నేను అన్ని మాతాలను గౌరవిస్తాను. కానీ నా హిందూ మతం కోసం నిలబడతాను. సోషల్ మీడియాలో సనాతన ధర్మం గురించి ఎవరైనా చులకనగా, అవహేళనగా మాట్లాడితే అటువంటివారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో‘నరసింహ వారాహి గణం’ ఏర్పాటు చేస్తున్నాను,” అని చెప్పారు. 

దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడు, కేరళలో అడుగుపెట్టలేకపోతున్న బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ని ఈవిదంగా వాడుకొని ఆ రెండు రాష్ట్రాలలో పాగా వేయాలని ప్రయత్నిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో తమిళనాడు ఎన్నికల సమయానికి తేటతెల్లం అవుతాయి.