వక్ఫ్ బోర్డ్, టీటీడీకి తేడా తెలీదా ఓవైసీ?

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణలు చేయడాన్ని తప్పు పడుతూ మజ్లీస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం చెపుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తావన చేశారు. దీనిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అసదుద్దీన్‌ ఓవైసీకి వక్ఫ్ బోర్డుకి, టీటీడీకి తేడా తెలీదని ఆయన మాటలతో అర్దమైంది. వక్ఫ్ బోర్డ్ ముస్లింల మతానికి సంబందించినది కాదు.  భూములకు సంబందించిన వ్యవహారాలు చూసే సంస్థ. కనుక దీనికి ఎటువంటి పవిత్రత లేదు. లేని పవిత్రతని బోర్డుకి ఆపాదించాల్సిన అవసరం లేదు. 

కానీ టీటీడీ అనేది పవిత్రమైన ధార్మిక సంస్థ. హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ వ్యవహారాలు చూస్తుంటుంది. భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలతో టీటీడీ నిర్వహణ సాగుతుంటుంది. కనుక టీటీడీతో వక్ఫ్ బోర్డుని ముడిపెట్టి అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడటం చాలా హాస్యస్పదంగా ఉంది. 

వక్ఫ్ బోర్డు భూములను కాపాడి అవి నిరుపేద ముస్లింలు ఇళ్ళు కట్టుకునేందుకు దక్కేలా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆశయం. కనుక వక్ఫ్ బోర్డు చట్టసవరణలో ఎటువంటి మతపరమైన ఆలోచన లేదు. అసదుద్దీన్‌ ఓవైసీ ఇంతకాలం కేసీఆర్‌తో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌కి దగ్గరవుతున్నారు కనుకనే ఈవిదంగా మాట్లాడుతున్నారని భావిస్తున్నాను,” అని బండి సంజయ్‌ అన్నారు.