మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్‌

మెట్రో రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 26న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్ట్ రెండో దశ సమగ్ర నివేదిక (డీపీఆర్)పై చర్చించి ఆమోదం తెలిపింది. రెండో దశలో మెట్రోని రెండు భాగాలుగా విభజించింది. 

కారిడార్‌-4: నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిమీ. 

కారిడార్‌-5: రాయదుర్గం-కోకాపేట వద్ద నియో పోలీస్ వరకు 11.6 కిమీ. 

కారిడార్‌-6: ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిమీ. 

కారిడార్‌-7: మియాపూర్-పటాన్‌చెరు వరకు 13.4 కిమీ. 

కారిడార్‌-8: ఎల్బీ నగర్‌-హయాత్ నగర్‌ వరకు 7.1 కిమీ         

మొదటి భాగంలో 5 కారిడర్లు కలిపి మొత్తం 76.4 కిమీ పొడవునా నిర్మించేందుకు రూ.24,269 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ శనివారం జీవో జారీ చేసింది. ఇంత ఆర్ధిక భారం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే భరించలేదు కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మించాలని నిర్ణయించింది. 

దీనిలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటాగా రూ.7,313 కోట్లు, వివిద ఆర్ధిక సంస్థల నుంచి రుణాల రూపేణ రూ.11,693 కోట్లు, పిపిపిలో భాగంగా మరో రూ.1.033 కోట్లు సమకూర్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం వాటా (18 శాతం) రూ.4,230 కోట్లు వస్తాయని పేర్కొంది.