తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ కి చాలా చక్కటి సలహా ఇచ్చారు. మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులు అందరూ ప్రభుత్వాసుపత్రులలోనే వైద్య చికిత్సలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వాసుపత్రుల పనితీరు చాలా మెరుగుపడుతుందని, అభిప్రాయపడ్డారు. దాని వలన సామాన్య ప్రజలకి ప్రభుత్వాసుపత్రులలో మంచి చికిత్స లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో సామాన్య, నిరుపేద, మధ్యతరగతి ప్రజలందరికీ వైద్యసేవలు లభించేలా చేయవలసిన భాద్యత ప్రభుత్వం మీదే ఉందని అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పిన ఈ సలహాని నిజంగా ప్రజా ప్రతినిధులు అందరూ ఆచరణలో పెడితే ఆయన చెప్పినట్లుగానే రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పనితీరు తప్పకుండా బాగుపడుతుంది. అలాగే వాటి స్థితిగతులు, అవి ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వాటిలో పేరుకొన్న అవినీతి వంటి అన్ని విషయాల గురించి కూడా వారికి మంచి అవగాహన ఏర్పడుతుంది కనుక వాటిని సరిచేయడానికి వీలుపడుతుంది.
ఇటువంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాస్ చేశారు. ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తన మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొన్నారు. కనుక ఆ సమయంలో ఆ ఆసుపత్రి కార్పోరేట్ ఆసుపత్రికి ధీటుగా నిర్వహించబడి, సామాన్య ప్రజలకి కూడా వేగంగా, మంచి వైద్యం అందించింది. కానీ ఆయన ఒక్కరే ఒక్కసారి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్నంత మాత్రాన్న ప్రభుత్వఆసుపత్రులకి సోకిన జబ్బులు వదలవు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పినట్లుగా మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా ప్రభుత్వాసుపత్రులలోనే చికిత్స చేయించుకోవాలనే నిబంధన ఏర్పాటు చేయడం చాలా మంచిదే అవసరం కూడా.