పీసి ఘోష్ కమీషన్‌ గడువు పొడిగింపు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ గడువు మరో రెండు నెలలు అంటే డిసెంబర్‌ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

పీసి ఘోష్ కమీషన్‌ ఇప్పటికే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురు ప్రస్తుతం పనిచేస్తున్న మరియు మాజీ అధికారులని, ఇంజనీర్లని ప్రశ్నించి అనేక వివరాలు రాబట్టింది. తర్వాత ఆర్ధికశాఖ, నీటిపారుదల శాఖలలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ అధికారులను కూడా ప్రశ్నించబోతోంది. 

వారందరినీ ప్రశ్నించడం పూర్తయిన తర్వాత వారు తెలియజేసిన వివరాలన్నిటినీ క్రోడీకరించి మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, చివరిగా మాజీ సిఎం కేసీఆర్‌ని ప్రశ్నించి తుది నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరికొంత సమయం పడుతుంది కనుక డిసెంబర్‌ నెలాఖరు వరకు కమీషన్‌ గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బహుశః వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలోగా కమీషన్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా కేసులు నమోదు చేస్తుంది కనుక అప్పటి నుంచి కేసీఆర్‌, హరీష్ రావులకు కష్టకాలం మొదలవవచ్చు.