భారత్ మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బుదవారం నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలంలో తను దత్తత తీసుకొన్న పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని సందర్శించబోతున్నారు. ఆయన ఈరోజు మద్యాహ్నం 12గంటల ప్రాంతానికి అక్కడికి చేరుకొని సుమారు రెండు గంటల పాటు ఆ గ్రామంలో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సచిన్ టెండుల్కర్ రెండేళ్ళ క్రితం ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎంపి లాడ్స్ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇదివరకు రెండుసార్లు ఆ గ్రామానికి ఆయన వచ్చి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించారు. మళ్ళీ ఈరోజు మరొకసారి పర్యటనకి వస్తున్నారు.
ఆయన దత్తత తీసుకొన్న తరువాత పుట్టంరాజు కండ్రిగ గ్రామం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఊరులో మంచి రోడ్లు, డ్రెయినేజ్ వ్యవస్త, విద్యుత్ దీపాలు, రక్షిత మంచినీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించబడ్డాయి. గ్రామంలో కొందరు నిరుపేదలకి ఇళ్ళు కూడా కట్టించారు. ఒక వ్యక్తి పూనుకొంటే, ఒక గ్రామంలో ఇంత అభివృద్ధి సాధ్యమైనప్పుడు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పూనుకొంటే దేశమంతా అభివృద్ధి సాధ్యం కాదా? అని ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది కదా? కనీసం ఇప్పటి నుంచైనా ప్రజా ప్రతినిధులు అందరూ తలో చెయ్యి వేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామాలన్నీ మళ్ళీ కళకళలాడతాయి.